*విజేఎఫ్ పై విష ప్రచారాలు మానండి*

    

జర్నలిస్టుల పరువును తీసే విధంగా వ్యవహరించకండి... 

కొద్దిమంది స్వార్థం కోసమే వివాదాలు...

వీ.జె.ఎఫ్ కే మెజార్టీ సభ్యుల మద్దతు..

రెచ్చగొట్టే విధంగా మెసేజులు చేస్తున్న సంయమనం పాటిస్తున్నాం...

ఎన్నికల్లో గెలిచిన వారికి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధం...

*విజేఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు*

విశాఖపట్నం.(డాబాగార్డెన్స్ మే 8) అక్షరవిజన్ -: సీనియర్ జర్నలిస్టులమని చెప్పుకునే కొంతమంది కావాలనే మూడున్నర దశాబ్దాల  చరిత్ర కలిగిన వి.జె.ఎఫ్ పరువును బజారుకీడ్చే చర్యలు చేపట్టడం విచారకరమని విజేఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. సోమవారం డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది సభ్యులు తొలుత 12 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, తర్వాత 20 లక్షలు అవినీతి జరిగిందని, ఆ తర్వాత గంట్ల శీనుబాబుకి ప్రెస్ క్లబ్ కొంచెం అమౌంట్ అప్పు ఉందని ఇలా నానా రకాలుగా వాట్సప్ గ్రూపులలో ప్రచారాలు చేస్తూ,అధికారులను కలిసి ఫిర్యాదులు చేస్తూ ప్రెస్ క్లబ్ పరువును తీస్తున్నారని అన్నారు.కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీకి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అన్ని ఆధారాలను  అందించడం జరిగిందన్నారు. కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్న సమయంలో కొంతమంది కావాలని పనిగట్టుకుని లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ వాట్సప్ గ్రూపులలో మెసేజ్లు చేస్తున్నారని చెప్పారు. నివేదిక వచ్చేవరకు తాము సంయమనం పాటించాలని భావించామని తెలిపారు. ప్రెస్ క్లబ్ పై అవగాహన లేని వాళ్ళు కొందరు చేస్తున్న ఆరోపణల పై తాము గట్టిగా స్పందిస్తే పరిస్థితి వేరుగా ఉంటుందన్నారు. ఆరోపణలు చేస్తున్న కొంతమంది అసలు స్వరూపాలు అందరికీ తెలుసన్నారు. వారిలో ప్రతి ఒక్కరికి సంబంధించిన బాగోతాలపై తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. కానీ తాము ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని భావిస్తున్నామని చెప్పారు. వారిలా తాము ఎదురుదాడికి ప్రయత్నించడం లేదని సంయమనం పాటిస్తున్నామని పేర్కొన్నారు. కాలం చెల్లిన కార్యవర్గం అనే వ్యాక్యాలు చేయడం సంస్కారం కాదని చెప్పారు. గత చరిత్రను చూసుకుంటే కొత్త కమిటీ ఏర్పడే వరకు పాత కమిటీ బాధ్యతలు చూసుకుంటుందని తదుపరి గెలిచిన వారికి బాధ్యతలు అప్పగిస్తుందని వెల్లడించారు. 35 ఏళ్లుగా (గతంలో )ఇదేవిధంగా ఎన్నికలు జరిగాయని చెప్పారు. ఈమాత్రం అవగాహన లేకుండా కాలం చెల్లిన కార్యవర్గం అని చేస్తున్న ఆరోపణలు చెల్లవని అన్నారు. 2018లో చివరి కోర్టు కేసు పై తీర్పు ఆధారంగా ఎన్నికలకు వెళ్లాలని సిద్ధమవుతున్న తరుణంలో కోవిడ్ కారణంగా మూడేళ్లు ఎన్నికలకు ఆటంకం ఏర్పడిందన్నారు. కోర్టు డైరెక్షన్ మేరకు, జిల్లా కలెక్టర్ సూచనలతో, ప్రెస్ క్లబ్ బైలా ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విజేఎఫ్ పై ఎటువంటి అవగాహన లేని కొంతమంది కావాలని ఎన్నికలను ఆపేందుకు ప్రెస్ క్లబ్ పై ఆరోపణలు చేస్తు న్నారని అన్నారు. నిజంగా ఎన్నికలు జరగాలనుకుంటే ప్రెస్ క్లబ్ కమిటీకి సహకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాల్సిందే అన్నారు. కానీ అలా జరగలేదని చెప్పారు. ప్రతిరోజు మీడియా వాట్సప్ గ్రూపులలో అదేపనగా ప్రెస్ క్లబ్ పై చెడు ప్రచారాలు చేయడమే తమ పని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాము బాధ్యతలు చేపట్టిన సమయంలో ప్రెస్ క్లబ్ ను  రూ. 35 వేలుతో అప్పగించారని తెలిపారు. కానీ  12 కోట్ల మేర అవినీతి జరిగిందని అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జరగకుండా ఆపేందుకు వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదని చెప్పారు. సుమారు 700 పైగా సభ్యత్వ నమోదు జరిగిందని పేర్కొన్నారు. దీన్ని బట్టి మెజార్టీ సభ్యుల మద్దతు ప్రెస్ క్లబ్ కమిటీకి ఉందనే ఉన్న విషయం అవగతమవుతుందన్నారు. ఎంత రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ, మీడియా గ్రూపులలో మెసేజ్లు పెట్టినప్పటికీ తాము సంయమనం పాటిస్తున్నామని పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీ నుంచి వచ్చే నివేదిక కోసమే ఎదురుచూస్తున్నామని చెప్పారు. నివేదిక వచ్చిన అనంతరం నిబంధనల మేర ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులను ఆహ్వానించి వారికి ప్రెస్ క్లబ్ బాధ్యతలను అప్పగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వి.జె.ఎఫ్ కార్యదర్శి దాడి రవికుమార్, ఉపాధ్యక్షులు నాగరాజు పట్నాయక్, కోశాధికారి పి.ఎన్.మూర్తి, సభ్యులు మాధవ్, ఈరోతి ఈశ్వరరావు గిరిబాబు పాల్గొన్నారు.

బ్యూరో చీఫ్ -: డీ ఎస్ ఎన్. 

Comments