అక్షరవిజన్ న్యూస్.. హైదరాబాద్.. అప్పటిలా మోసం చేయొద్దు.. బాధితులందర్నీ ఆదుకోండి: డీకే అరుణ..
*వరద బాధితులకు తక్షణ సహాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీ కే అరుణ బహిరంగ లేఖ రాశారు. కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించడానికి ముఖ్యమంత్రికి సమయం దొరకలేదా అని ప్రశ్నించారు. భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని లేఖలో పేర్కొన్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవడం వల్లే అపార ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని ఆరోపించారు. సీఎంగా ప్రజలకు భరోసా కల్పించాల్సింది పోయి ఫాంహౌస్‌లో సేదతీరడం తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్‌కు ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుందన్నారు. తూతూమంత్రంగా ఒక్కరోజు పర్యటన చేశారని విమర్శించారు. కమీషన్ల అత్యాశతో కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన నిర్వాకానికి తెలంగాణ ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు ముంపునకు గురై సర్వం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 15వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని తెలిపారు. మంథనిలో సుమారు 1500 కుటుంబాలు ముంపునకు గురయ్యాయని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో మోసం చేసినట్లు కాకుండా బాధితులందరికీ నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.