హిందూ ధర్మమే నాకు స్ఫూర్తి... బ్రిటన్ ప్రధానమంత్రి రిషిసునాక్
భార్య అక్షతతో కలసి స్వామినారాయణ్ మందిర్ లో పూజలు..
అక్షరవిజన్ న్యూస్, లండన్ -: హిందూ ధర్మమే తనకు స్ఫూర్తి, ప్రేరణను, సాంత్వనను అందిస్తుందని భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషిసునాక్ పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యునిగా భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా వుందన్నారు. ఫలితాన్ని గురించి ఆలోచించకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని భగవద్గీత బోధిస్తుంది' అని ఆయన అన్నారు. ఆదివారం రిషిసునాక్ భార్య అక్షతా మూర్తితో కలిసి లండన్లోని నియాస్డెన్ ప్రాంతంలో ఉన్న స్వామినారాయణ్ మందిరాన్ని సందర్శించుకున్నారు. వచ్చే 4 వ తేదీన బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ వారు ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు రిషిసునాక్ దంపతులకు ఆలయంలోకి స్వామినారాయణ్ ట్రస్ట్ సభ్యులు ఘనస్వాగతం పలికేరు . ఈ సందర్భంగా ప్రసంగాన్ని ప్రారంభించిన సునాక్ జై స్వామినారాయణ్ అంటూ నమస్కరించి భారత జట్టు టీ20 ప్రపంచ కప్పును గెలుచుకున్నందుకు జట్టు సభ్యులుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయానికి హిందూ సాంప్రదాయం గా చీర ధరించి వచ్చిన అక్షతామూర్తి అక్కడి మహిళలు, చిన్నారులతో ముచ్చటించి కలియతిరిగేరు. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంటున్న వేళ ప్రతిపక్ష లిబరల్ పార్టీ నేత కీర్ స్టార్మర్ హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం లండన్లోని కింగ్స్బరీ ప్రాంతంలో ఉన్న స్వామినారాయణ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. జై స్వామినారాయణ్ అంటూ స్టార్మర్ ప్రసంగించారు. అధికారంలోకి వస్తే భారత్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
బ్యూరో చీఫ్ -: డి ఎస్ ఎన్ మూర్తి