అమర్నాథ్ యాత్ర..

అక్షరవిజన్ న్యూస్.. అమర్నాథ్.. కుంభవృష్టి, వరదల కారణంగా రెండు రోజులపాటు నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది. దాదాపు నాలుగు వేల మంది వరకు భక్తులను అధికారులు అనుమతించారు. పహల్గాంలోని నున్వాన్ బేస్ క్యాంపు నుంచి చందన్ వారి వైపు యాత్ర సాగుతోంది. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభమైన సంగతి తెలిసిందే.సోమవారం ఉదయం నాలుగున్నర గంటలకు పహల్గాం నుంచి 3,010 మంది భక్తులు, బల్తాల్ బేస్ క్యాంపు నుంచి 1,016 మంది భక్తులు తమ యాత్రను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దర్శనం చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు వెళ్లబోమని, మంచు లింగాన్ని దర్శనం చేసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నామని భక్తులు చెబుతున్నారు. గత శుక్రవారం నాటి వరదల కారణంగా అమర్‌నాథ్‌లో పదహారు మంది మరణించారు. దాదాపు 36 మంది వరకు గల్లంతయ్యారు. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. దీంతో శని, ఆదివారాల్లో యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. బాధితుల్ని రక్షించేందుకు ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలు ప్రయత్నిస్తున్నాయి.హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం ఆదివారం రాడార్లను ఇండియన్ ఆర్మీ ప్రయోగించింది. గాయపడ్డవారిలో 35 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో 17 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు, యాత్ర సజావుగా సాగుతుందని భావిస్తున్నట్లు అమర్‌నాథ్ యాత్ర కమిటీ తెలిపింది.

Comments