గీతంలో ఘనంగా విజేతల దినోత్సవం...
విశాఖపట్నం, అక్షరవిజన్ న్యూస్ -: దేశంలోని ప్రముఖ డీమ్డ్ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా పేరొందిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం రికార్డు స్థాయిలో 1200 మందికి పైగా విద్యార్ధులు ఉద్యోగాలు సాధించడంతో పాటు ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాలలో సహితం ఉన్నత విద్యాభ్యాసానికి ప్రవేశాలు సాధించడంతో ఎఛీవర్స్ డే పేరిట గురువారం విజేతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో దాదాపు 300 కి పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు గీతం ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్‌మెంట్, ఫార్మశీ, ఆర్కిటెక్చర్, లా తదితర కోర్సులు చదువుతున్న విద్యార్ధులకు నిర్వహించిన ఇంటర్వూల ద్వారా విద్యార్ధులు ప్రతిభ కనబరిచి ఈ ఘనతను సాధించినట్లు విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వై.గౌతమ్‌రావు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సంఖ్యలో విద్యార్ధులను ఉద్యోగస్తులుగా ఏటా అందిస్తున్న ఘనత గీతం విశ్వవిద్యాలయందేనని ఆయన పేర్కొన్నారు. వివిధ పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా కోర్సులను రూపొందిస్తున్నామని, గీతం విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు ప్రాంగణాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని, విద్యార్ధులను దేశం గర్వించే మానవ వనరులుగా తీర్చిదిద్దటం తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. గీతం విద్యార్ధులలో స్టార్టప్‌ల ఏర్పాటు దిశగా ప్రోత్సహించడానికి వెంచర్ డవలప్‌మెంట్ సెంటర్ (విడిసి) ఏర్పాటు చేశామని వెల్లడించారు. దీంట్లో భాగంగా ప్రముఖ ఐటి సంస్థ టెక్ మహేంద్ర వైస్ ప్రెసిడెంట్ ఎమ్.నాగార్జున మాట్లాడుతూ గీతం సాధిస్తున్న విజయాలను ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని, నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్న ఉన్నత విద్యాలయంగా గీతం ప్రగతి స్పూర్తిదాయకమన్నారు. కృత్రిమ మేధ వంటివి యువతకు కొత్త సవాళ్ళను, అవకాశాలను సృష్టిస్తున్నాయని వాటిని ఉపయెాగించుకోవాలని పిలుపునిచ్చారు. యువతరం నిరంతర విద్యార్థిగా నైపుణ్యాలను మరుగుపెట్టుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో గీతం వివిధ విభాగాల డీన్‌లు, అధిపతులు, గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ అధిపతి కె.వి. ఉమాదేవి, డైరక్టర్ వంశీకృష్ణ సోమయాజుల, తదితరులు పాల్గొని విద్యార్ధులను అభినందించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్ధులు, తల్లిదండ్రులు గీతం ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ విభాగం కృషికి ధన్యవాదాలు తెలిపారు.
రిపోర్టర్ -: రాజు