వి హెచ్ పి , భజరంగ్ దళ్ డిమాండ్..

 అక్షరవిజన్ న్యూస్..  హిందువులు భక్తి భావంతో పూజించే దేవి, దేవతలను కించపరిచేలా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ డిమాండ్ చేశాయి. సీఎం కేసీఆర్ ఈ నెల 10వ తేదీన ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నందున రాష్ట్ర వ్యాప్తంగా సీఎంపై అన్ని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు వారు ప్రకటించారు. ఇందులో భాగంగా మంగళవారం ఖైరతాబాద్, సరూర్ నగర్, ఎల్‌బీ నగర్, సనత్ నగర్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు దాఖలు చేశామన్నారు.భజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ మలిగె అభిషేక్ కుర్మ మాట్లాడుతూ.. ఇటీవల పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ..తెలంగాణలోని ప్రముఖ దేవతలందరినీ కీర్తించినట్లు తెలిపారు. అయితే ఆ వ్యాఖ్యలను రాజకీయ పరంగా తప్పుపడుతూ.. సీఎం కేసీఆర్ హిందూ దేవి, దేవతలను కించపరిచేలా మాట్లాడటాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఆ వ్యంగమైన మాటలతో హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. "ఆ అంబా.. ఈ అంబా" అంటూ 'జోగులాంబ' ను అవమానపరిచిన తీరు క్షమించరానిదని, ముఖ్యమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లో కేసులో నమోదు చేస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో సీఐని కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు అందజేయడం జరిగిందని ఆయన వివరించారు.

Comments