24, 25 తేదీలలో హజరత్ ముఖియార్ అలీ చారిటబుల్ ట్రస్టు వార్షికోత్సవ వేడుకలు..
అక్షరవిజన్ న్యూస్-: ఈ నెల జూన్ 24, 25 తేదీలలో హజరత్ ముఖియార్ అలీ చారిటబుల్ ట్రస్టు వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆ ట్రస్టు ఛైర్మన్ డాక్టర్ ఎం.డి అహ్మద్ తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హజరత్ ముఖియార్ అలీ చారిటబుల్ ట్రస్టు (మధురవాడ) డోర్ నెంబరు 9-21/1, శ్రీవల్లినగర్ వద్ద ఈ వేడుకలు నిర్వహించనున్నామని తెలిపారు. వార్షికోత్సవ కార్యక్రమాలు వివరిస్తూ ముందుగా 24వ తేది సోమవారం చందనం సమర్పించుటకై ఉదయం 8 గంటల నుంచి 10 గంటల సమయంలో మధురవాడ నుంచి కొమ్మాది, మారికవలస, మీదుగా భీమిలి క్రాస్ రోడ్డు దాటుకొని గారిపేట గ్రామం వరకు తమ ఆచారం ప్రకారం ఊరేగింపుగా వెళ్లనున్నామన్నారు. ఈ ఊరేగింపులో మా ట్రస్టు సభ్యులు, వివిధ రకాల వాహనాలు, ఇతర సాంస్కృతిక కార్యాక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అక్కడకి చేరుకొని చందనం సమర్పించుకున్న అనంతరం తిరిగి అదే రోజు సాయంత్రం 3:30 నుంచి 10 గంటల సమయంలో గారిపేట నుంచి యధావిధిగా మధురవాడ చేరుకుంటామన్నారు. మరుసటి రోజు తేది 25 మంగళవారం తమ ట్రస్టు యందు పేదలకు భోజనం పంపిణీ కార్యక్రమం చేపట్టి భారీ అన్న సమారాధన నిర్వహించనున్నామని తెలిపారు. అలాగే గత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ట్రస్టు తరుపున ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలియజేశారు. అనంతరం వివిధ రంగాలలో ఉత్తమ కళాకారులకు కూడా తమ ట్రస్టు తరుపున ప్రత్యేకంగా సన్మానించి బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ట్రస్టు వార్షికోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన వాలీబాల్, బాస్కెట్ బాల్ తదితర క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నామన్నారు. హజరత్ ముఖియార్ అలీ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గ శాసన సభ్యులు గంటా శ్రీనివాసురావు హాజరుకానున్నారని, ఆయనతో పాటు మధురవాడ పరిధిలో ఉన్న పలు వార్డు నాయకులు, ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని, అలాగే పోలీసు శాఖ , మరియు మీడియా మిత్రులు కూడా హాజరై తమ ట్రస్టు వేడుకలు విజయవంతం చేయాలని అహ్మద్ కోరారు . ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు భాషా, సుభహాని , సుధీర్ , తాజ్ , జలాల్ భాష, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ -: రాజు